19 October 2017
Hyderabad
దీపావళి శుభాలతో...
వెలుగు వాకిటకి ఎక్కుపెట్టిన కనుబొమల విల్లంబులు
కాంతి రేకలు విరజిమ్ము పువ్వొత్తుల కంటి పాపలు
పువ్వొత్తులను నిలబెట్టు తీగలాగిన కంటి కొసలు
నవ్వుల మతాబాలు నొక్కిపెట్టిన అరవిచ్చిన పెదవులు
ముద్దంత ఒక్కచోట చేర్చిన చిచ్చు బుడ్డుల చుబుకాలు
చక్రాలు గింగిరాలు తిరగ చారడేసి చెక్కిళ్ళు
పాంబిళ్ళలు జరజర ప్రాకిపోవు మెలికెల జడపాయలు
అంతవరకు తలొంచుని అంతలోనే ఎగసిపడే తారాజువ్వల తలంపులు
మిరుమిట్లు గొలుపు కాంతులకు మందుగుండుతో పనిలేదు
చిరునవ్వు పులుముకున్న ప్రియ వదనమే చాలు
కంటి నలుపుల కార్చీకట్లను తరుమ
రెప్ప వెంట్రుకల పత్తి వత్తులు చుట్టి
కంటి చెమ్మల చమురున వాటినిన్ తడిపి
చూపు కాంతితో వెలిగించు కంటి ప్రమిదలు
చిమ్మ చీకటిని కరింగించు చిన్న దీప కళికలు
నిస్సత్తువ ఆవురించిన నిశీధి వీధులలో
కాలి అందియల గలగలు
పట్టుబట్టల బిరబిరలు
పలుకు తేనియల మధురిమలు
నిశ్శబ్దమను పారద్రోలు ప్రియ వచన గీతికలు
శబ్దకాంతుల కేళే దీపావళైతే
మాటకు మించిన టపాసు లేదు
చూపుకు తగిన ప్రమిద కానరాదు