19 October 2018
Hyderabad
వందేమాతరం
తంత్రులు తెగిపడే తీవ్రతతో
సత్తువ సడలకూడదను సంకల్పముతో
సన్నగిల్లే సకల శక్తులూ కూడదీసుకుని
వంటి లోని ఓపికను ఒక్కచోట కేంద్రీకరించి
కెవ్వుమనే కేరింతకి తొలిశ్వాస అందించి
ఆయువు అంకురార్పణకు ఆరాటపడు ప్రతి తల్లీ ఒక బ్రాహ్మిణి
ఎదురు దెబ్బల వేళ ఊరటై నిలిచి
చేవ చచ్చిన చోట చైతన్యము చవిచూపించి
విషయ మర్మముల కడ వివేచనను పెంచి
విచక్షణను పాటించు విఙ్ఞతను నేర్పించి
ఉన్న చోటనుండి సంతు ఉన్నతమును వాంఛించి
పెంపుదల బాటలో వెన్నటి నడుచు ప్రతి తల్లీ ఒక వైష్ణవి
పేగు పంచిన వారికే తెలుసు కడుపు కోత ఏమిటో
జన్మ ఇచ్చిన వారికే తెలుసు బ్రతుకు విలువ ఏమిటో
పట్టి కుడిపిన పాలతో పెరిగి పెద్ద అయి
పంచి ఇచ్చిన రక్తమాంసములతో ఒళ్ళు మదించి
కండ సిరితో మిడిసిపడి కన్ను కానక పేట్రేగు
రాకాసి మూక కడ మూడో కంటితో భస్మించు ప్రతి తల్లీ ఒక శివాని
ఒక్క మూర్తిలో మూడు రూపాలు, ఒకే గుండెలో మూడు భావాలు
వందే త్రైమూర్త్యాం మాతరం, వందేమాతరం