13 September 2018
Hyderabad
మర్మయోగి
అరమోడ్పులతో దృష్టి భౄమధ్యమున నిలిపి
అర్ధనిమీలితముతో సదా సృష్టి విచారము చేసెడి
త్రిగుణాతీతుడైన తాపసి
లోనికి దారివ్వక మోకాలడ్డిన బుడతడిపై
కృద్ధడై శిరమును ఖండించు దండనమేమి?
స్వామి ప్రసన్నతకు కైలాసమునే పెకలించి
తల బలుపుతో తలల మీద నిలిప సాహసించి
ఆ క్రమములో శివుని బొటన వేలి బరువున నలిగి
తెలివి తెచ్చుకున్న దశకంఠుని చందాన
తుంటరి తలను ఏనుగు తలతో ఏమార్చు మార్గము
తెంపరి తలకు నెమ్మది తనము నేర్పించు క్రమము
ఎదురుపడిన దానిని అణగద్రొక్కు శక్తి కలిగిన కరి
సంయనము పాటించి విచక్షణతో వర్తించు విధానమే
చిన్న తలపు స్థానే మెండు తలను ప్రతిష్ఠించుటలోని ఆంతర్యము
కాముని మరిగించి కామితమును జయించి
లేదన్న వారికి ఇక వదన్న వరకు ఇచ్చి
ఈప్సితములను ఈడేర్చు ఈశునికి
గజ ముఖునికి మూషికమును జత గట్టి
ముజ్జగములము వేగిర ఊరేగి రమ్మన ముచ్చటేమిటో?
అడిగిన తడవునే అరచేతిని కాలాగ్నిని చేసిచ్చి
వేడిన వెంటనే విషమును నిముషములో గుటకపెట్టి
ఊరు పోయిన వారికి వరముల వర్షములు కురిపించి
కన్న కొడుకు కడ మాత్రము కోరినది కట్టబెట్టని కారణము...
సామర్ధ్యమన్న శక్తియుక్తుల సంపత్తులే కాక
నాయకత్వ పటిమలో నమ్రత నిబద్ధతల ఆవశ్యకము
తలకు మించిన పనిని తల మీద మోపి
తెలియని చోట తగ్గి మెలగవలసిన ఙ్ఞానము
సోదాహరణముగ సుతునకు వివరించిన వైనము
తలను తీయుట తలంపును తొలగించుటే
కోరినది కాదనుట అణకువను అలవరచుటకే