7 November 2018
Hyderabad
(ఆరంభ)శూరులు
వీరుడివోయ్!
టపాకాయల మెలికెల తాడు మెడవంపులో తిప్పి
సర్పరాజును చుట్టిన శితికంఠుని తలపించి
ఒంటి చేతితో ఓ మూల వత్తికి నిప్పుపెట్ట తలపోసి
చుట్టూ చూసే ప్రజకి చేవ చూపించు నీవు
వీర మాతకు పుట్టిన వరపుత్రుడివోయ్!
సాహసివివోయ్!
వింత రంగులు చిమ్ము బుడ్డిని అరచేతిలో నిలిపి
చిచ్చుబుడ్డిని తారాజువ్వగా ఏమార్చు విరించివై
నిప్పు రవ్వల చినుకుల చురకలకు వెరవక
అగ్నితో అభ్యంగనము ఆచెరించెడి నీవు
ఆపదలతో ఆటలడుకొను ఆత్మీయుడవోయ్!
ధీశాలివోయ్!
వర్తులములో నిప్పు కణికలు విసురు చక్రమును పట్టి
సుదర్శనము వేలితో శాసించు విష్ణుమూర్తిలా ఒప్పి
వెలుగును వేగము తరుముకొని పోవు ఈ వింత క్రీడను
చిటపటల ఛటచ్ఛటలతో చేతి లాఘవమున చూపించు నీవు
కనికట్టు నేర్చిన గరడీవానివోయ్!
ప్రతి దీపావళికీ పుర వీధులలో ప్రదర్శన లిచ్చు ఈ మూర్ఖ శిఖామణులు
బడాయి భేషజ డాంబికాలకు దత్తపుత్రులు తెలివిలేమి త్రిమూర్తులు