07 September 2024
Hyderabad
పర్యావరుణుడు
చిగురించిన చెట్ల చాటున వినిపించెను వాసంతము
విరబూసిన విరుల దారి కదలి వచ్చెను భాద్రపదము
విప్పారిన పురితో వనములే వేదిక చేసుకుని నెమలి
వానకారు వరసలలో జరిపేను జగతి మురిసెడు జతి
పత్ర పుష్పాలతో పూల ఫలలతో నిండు చూలాలిగా ప్రకృతి
ప్రసవించింది తన పూత పంటగా పర్యావరణ పరిరక్షకుడిని
వన్య ప్రాణి ముఖము వచ్చి చేరెను వినాయకుడికి
నవ్యతని సంతరించిపెట్టెను పురాణ కథా గమనానికి
జంతువులను తలకెక్కించుకొను జీవ కారుణ్యమును
మించె పామును పాశముగ చేయు భూత దయయును
మనిషికే చెందందు ప్రపంచమున వనరులన్నీ అని
సమతుల్యమును చూపె మూడు జీవులని నిలిపి ఒక్క రూపుని
మట్టితో చేసిన ప్రతిమ తిరిగి మన్నులో చేరెడు విధము
గరికతో కొలిచిన పిదప తిరిగి గడ్డినే కరిచెడు వైనము
వినాయకుని పూజలో వస్తువుల పునరుపయోగ ప్రతిపాదనము
దేని నించి వచ్చేనో తుదకు దానికే చేరేను అనే సిద్ధాంతము
ప్రకృతి అనే పార్వతి నలుగులో ఉసురు పోసుకున్న నలుసుకు
ప్రతి అంశమందు తల్లి సంరక్షణమే ప్రాధమిక సూత్రమౌను