14 January 2020
Hyderabad
సంక్రాంతి సమిథలు
ముక్కు మొనలతో కత్తి కొనలతో
ఒకరి వళ్ళు ఒకరు ఛిద్రము చేసుకుని
వాడి గోళ్ళతో ఓడు ఒళ్ళతో
చివరి ఊపిరి వరకు పట్టు విడవక పోరి
పిచ్చి కేకలతో పచ్చి అరుపులతో
గుమిగూడిన గుంపుల గంపగుత్త ఉల్లాసములకు
లేని కక్షలను తగని శిక్షలను
జాతి లక్షణములు చేసుకున్న పందెము కోళ్ళు
వీర మరణమైనా విజయ లక్ష్మినైనా
వధువుగా కట్టబెట్టు వికృత సంస్కృతికి ఆనవాళ్ళు
ఎందిన డొక్కలతో మండిన గుండెలతో
తరాల తరబడి తలరాతలకు తలవంచి
మొండి కర్రులతో బండ చేతులతో
బీటవారిన బీళ్ళను సాగు చేసుకుని
నింగి నుండి జారు నేల నుండి ఊరు
నీటి బొట్టు కోసము చెమట బొట్టును చిందించి
పట్టించుకోని ప్రజల పట్టింపులేని ప్రభుత
కనీస ఆదరణ కరువైన అన్నదాతలు
లేదన్న వారికి ఇక చాలన్న వరకు
అడగకుండగనె పెట్టు అమ్మతనానికి ప్రతిరూపులు